Car Ran over a child in Hyderabad : ఓ భవన నిర్మాణ కార్మికురాలు నిద్రపోతున్న తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెలార్కు తీసుకువెళ్లింది. అక్కడ పార్కింగ్ లాట్లో ఖాళీగా ఉన్న స్థలంలో ఆ పాపను నిద్రపుచ్చింది. ఆ తర్వాత తన పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్లో నివసించే ఓ వ్యక్తి బయటి నుంచి కారులో వచ్చాడు. రోజూ తాను పార్కింగ్ చేసే స్థలంలోనే తన కారును పార్కింగ్ చేసే ప్రయత్నంలో అక్కడ నిద్రిస్తున్న పాపను గుర్తించలేదు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన స్థలంలో పార్కింగ్ చేసేందుకు వెళ్లే క్రమంలో ఆ పాపపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే మరణించింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ లెక్చర్స్ కాలనీలో చోటుచేసుకుంది.
child run over by a car in Hyderabad : కర్ణాటక చెందిన కవిత, రాజు అనే దంపతులు గత మూడు సంవత్సరాలుగా నగరంలో కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. తమకు ఏడేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల పాప లక్ష్మి ఉన్నారు. లెక్చరర్స్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్టుమెంటు పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శ్లాబు పనులు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తమతోపాటే వచ్చిన చిన్నారి లక్ష్మి(3)ని తల్లి కవిత నిద్రపుచ్చింది. నీడ కోసం పక్కనే ఉన్న అపార్టుమెంటులోని పార్కింగ్ స్థలంలో బిడ్డను పడుకోబెట్టింది. ఆపై నిర్మాణ పనిలో నిమగ్నమైంది.
అదే సమయంలో అపార్టుమెంటులో నివసించే హరిరామకృష్ణ అనే వ్యక్తి తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో పాప పడుకుని ఉండటాన్ని గమనించకుండా కారును పార్కు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాప తలపైకి కారు ముందు చక్రం ఎక్కడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ దారుణాన్ని గమనించిన తల్లి గుండెలవిసేలా రోదించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే పాప మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. బతుకుదెరువు కోసం వస్తే తన చిట్టితల్లి ప్రాణాలు పోయాయని ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :