జీవితాంతం ఒకరికొకరం తోడూనీడగా కలిసి ఉంటామని ఒక్కటైన దంపతులు.. చిన్న చిన్న విషయాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాంటి సంఘటనే ఉత్తర్ప్రదేశ్ అలీఘడ్ జిల్లాలో జరిగింది. భార్య రోజూ స్నానం చేయట్లేదని భర్త విడాకులు(divorce news) కోరాడు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ససేమిరా అన్నాడు. తన వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు ఆ భార్య.. మహిళా రక్షణ విభాగాన్ని ఆశ్రయించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..?
అలీఘడ్ జిల్లాలోని చాందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తితో క్వార్సి గ్రామానికి చెందిన మహిళకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఏడాది వయసున్న చిన్నారి ఉంది. తను స్నానం చేయడం లేదని భర్త విడాకులు కావాలని గొడవ చేస్తున్నాడని.. ఇటీవల మహిళా రక్షణ విభాగాన్ని ఆశ్రయించింది భార్య. ఫిర్యాదు అందగా.. దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే.. ఆ వ్యక్తి తనకు విడాకులు కావాల్సిందేనని, ఈ విషయంపై తమ మధ్య ప్రతి రోజు గొడవలు(divorce due to domestic violence) జరుగుతున్నాయని తెల్చి చెప్పినట్లు అధికారులు చెప్పారు.
" ప్రతి రోజు స్నానం చేయట్లేదనే సాకు చూపించి తన భర్త త్రిపుల్ తలాక్ (triple talaq case)చెప్పాడని మహిళ మాకు రాతపూర్వక ఫిర్యాదు చేసింది. వివాహ బంధాన్ని నిలిపేందుకు దంపతులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చాం. తన భర్తతో కలిసే ఉండాలని మహిళ కోరుకుంటోంది. అయితే.. భర్త విడాకులు కావాల్సిందేనని పదే పదే చెప్పాడు. తన భార్య ప్రతి రోజు స్నానం చేయట్లేదని, విడాకులు ఇప్పించటంలో తనకు సాయం చేయాలని కోరుతూ భర్త కూడా దరఖాస్తు చేసుకున్నాడు. రోజూ స్నానం చేయాలనే విషయంపై ఇరువురికి గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు. "
- మహిళా రక్షణ విభాగం కౌన్సిలింగ్ అధికారి.
ఇది చిన్ని విషయం కాబట్టి మహిళ భర్తను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు కౌన్సిలింగ్ అధికారి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. తమ వివాహ బంధాన్ని కాపాడుకునే విషయంపై ఆలోచించుకోవాలని సమయం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు.. విడాకుల కోరిన దరఖాస్తులో ఎలాంటి హింసాత్మక చర్య, నేరం లేవని, పిటిషన్పై చర్యలు తీసుకోలేమని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Monkey Revenge: కోతి 'పగ'- ఆటోడ్రైవర్ గుండెల్లో దడ!