man constructed tomb: కర్ణాటక దావణగెరెలోని జారెకట్టేకు చెందిన తిప్పన్న రావు అనే వ్యక్తి తన సమాధిని ముందుగానే నిర్మించుకున్నాడు. జీవితం అంటే విరక్తి కలిగే ఇలా చేసినట్లు పేర్కొన్నాడు. సుమారు 70 ఏళ్ల వయసు ఉండే ఈ పెద్దాయన 15 ఏళ్ల క్రితమే సమాధిని సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. దానికి 'మరళి మణ్నిగే'(తిరిగి మట్టిలోకి) అనే పేరు కూడా పెట్టాడు.
ఒకరి ముందు దేహీ అనే దానికంటే చచ్చిపోవడం మేలు అంటున్నాడు తిప్పన్న. అందుకే తాను సంపాదించుకున్న డబ్బుతో ఈ సమాధిని నిర్మించుకున్నట్లు తెలిపాడు. తాను చనిపోయిన తరువాత ఆ సమాధిలోనే పూడ్చి పెట్టాలని కుటుంబ సభ్యులకు సూచించాడు.
"జీవితం అంటే విరక్తి కలిగింది. అందుకే నా సమాధిని ముందుగానే నిర్మించుకున్నాను. కానీ దేవుడు నాకు మరణాన్ని ఇంకా ప్రసాదించలేదు. ఇది నా సొంత డబ్బులతోనే 15 ఏళ్ల కిందట కట్టుకున్నాను. నేను చనిపోతే దీనిలోనే పూడ్చి పెట్టాలని నా కుటుంబానికి కూడా చెప్పాను. మానసిక ప్రశాంతత కోసం సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను."
- తిప్పన్న రావు
తాను నిర్మించుకున్న సమాధికి ముందు ఓ చిన్న గుడిని కట్టించాడు తిప్పన్న. అక్కడకు వచ్చిన వారు ఉండేందుకు ఓ వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు. తిప్పన్న సొంతూరు జారెకట్టే గ్రామం అయినా దావణగెరెలో ఇల్లు నిర్మించుకుని అక్కడే ఉంటున్నాడు. సమయం దొరికినప్పుడల్లా సమాధి దగ్గరకు వెళ్లి.. గ్రామంలో ఉండే పేదవారికి పండ్లు పంపిణీ చేస్తానని చెప్తున్నాడు.
ఇదీ చూడండి: 'ఆవు పేడ' సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలు- వినూత్నంగా అసెంబ్లీకి సీఎం