దేశంలో టీకా డోసుల(Vaccination In India) పంపిణీ 80 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కొవిడ్ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్(Vaccination in India till today) ప్రక్రియలో ఈ మార్క్‌ను అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
"కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. భారత్‌లో 80 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. ఈ మార్క్‌ను అందుకోవడం ఆనందంగా ఉంది."
---మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
శుక్రవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగింది. దేశవాప్తంగా ఒకేరోజు 2. 5 కోట్ల టీకా డోసుల(Vaccination News India) పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా దేశానికి అభినందనలు తెలిపిన మాండవీయ 'వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్' అనే పేరుతో ట్వీట్ చేశారు.
దేశంలో వ్యాక్సిన్ పంపిణీ సంఖ్య 10 కోట్లు (covid vaccine) చేరడానికి 85 రోజులు పట్టింది. ఆ తర్వాత క్రమంగా టీకా పంపిణీ పుంజుకుంది. అక్కడి నుంచి వ్యాక్సినేషన్ సంఖ్య.. 45 రోజుల్లో 20 కోట్లకు, 20 రోజుల్లో 50 కోట్లకు, 19 రోజుల్లో 60 కోట్లకు, 13 రోజుల్లో 70 కోట్లకు చేరింది. ఇప్పుడు ఐదు రోజుల వ్యవధిలోనే 80 కోట్ల మార్కును చేరింది.
ఇదీ చదవండి:'వ్యాక్సినేషన్లో ప్రపంచ రికార్డ్.. టీకా పంపిణీ@2.5కోట్లు'