Caretaker Assault: పసికందు ఆలనా పాలనా చూసుకుని కంటికి రెప్పలా కాపాడాల్సిన కేర్టేర్ రాక్షసిలా ప్రవర్తించింది. 8 నెలల చిన్నారిపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. చెవిని మెలిపెడుతూ.. ఎత్తుకుని మంచంపైకి విసిరేస్తూ.. విచక్షణ రహితంగా ప్రవర్తించింది. నిందితురాలి చర్యకు ఆ చిన్నారి మెదడులోని నరాలు చిట్లిపోయాయి. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసింది.
అమ్మలా ఉంటుందని అప్పగిస్తే..
సూరత్‌లోని రాందేర్కు చెందిన మితేశ్ పటేల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య కూడా ఉద్యోగి. ఇందువల్ల వారు ఇటీవల తమకు జన్మించిన కవల పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు ఓ కేర్‌టేకర్ అవసరమని భావించారు. ఈ క్రమంలో నిందితురాలిని నియమించుకున్నారు. అయితే కొద్ది రోజులకే..'మీరు లేని సమయంలో పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు' అంటూ చుట్టుపక్కల వారి నుంచి వారికి ఫిర్యాదులు అందాయి. దీంతో జాగ్రత్త కోసం వారు సీసీటీవీను ఏర్పాటు చేశారు.
అయితే శుక్రవారం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి తమ కవల పిల్లల్లో ఒకరు స్పృహతప్పి ఉండటం గమనించారు. హుటాహటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. పసికందు మెదడులోని నరాలు చిట్లినట్లు (Brain Hemorrhage) డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయంపై కేర్‌టేకర్‌ను అడిగితే అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదంటూ సమాధానం ఇచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు సీసీటీవీ చూడగా అసలు విషయం బయటపడింది. నిందితురాలు చిన్నారి చెవి మెలిపెడుతూ.. ఎత్తుకుని పలుమార్లు మంచం మీదకు విసిరేస్తూ ఉన్న ఆ వీజువల్స్ చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
పిల్లలు జన్మించినప్పుడే అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని.. రూ.15 లక్షలు ఖర్చు చేసి దాదాపు రెండు నెలల పాటు చికిత్స అందించిన తర్వాత వారిని ఇంటికి తీసుకురాగలిగామని చెప్పుకొచ్చారు చిన్నారి నాయనమ్మ. తన కుమారుడు-కోడలు ఉద్యోగాలకు వెళుతూ.. ఉండటం వల్ల ఈ కేర్‌టేకర్‌ను నియమించుకున్నామని కానీ ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని వాపోయారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉంది.
ఇవీ చూడండి :