గుజరాత్ అహ్మదాబాద్‌లో రెండో తరగతి చదువుతున్న అర్హమ్ ఓం తల్సానియా.. అరుదైన ఘనత సాధించాడు. ఆరేళ్లకే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పట్టు పెంచుకుని చిన్న చిన్న వీడియో గేమ్స్ సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో పైథాన్ కోడ్‌ను బ్రేక్ చేసి.. అతిచిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.
పియర్సన్ వీయూఈ టెస్ట్ సెంటర్ నిర్వహించిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ పరీక్షను పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు తల్సానియా. తన తండ్రి ప్రోత్సాహంతో కోడింగ్ నేర్చుకున్నానని చెబుతున్నాడు.
"మా నాన్న నాకు కోడింగ్ నేర్పారు. రెండేళ్ల వయసులోనే ట్యాబ్లెట్ ఉపయోగించటం మొదలుపెట్టా. మూడో ఏటనే ఐఓఎస్, విండోస్ పరికరాలు కొనుగోలు చేశా. ఆ తర్వాతనే మా నాన్న పైథాన్‌పై పనిచేస్తున్నారని తెలిసింది.
నేను చిన్న గేమ్స్ రూపొందిస్తున్న సమయంలో పైథాన్ సర్టిఫికేట్ వచ్చింది. ఆ తర్వాత నా పని గురించి కొన్ని ఆధారాలు కావాలని అడిగారు. వాళ్లు నన్ను ధ్రువీకరించిన తర్వాత గిన్నిస్ రికార్డు వచ్చింది."
- అర్హమ్ తల్సానియా
భవిష్యత్తులో వ్యాపారవేత్త కావాలని కోరుకుంటున్నట్లు తల్సానియా తెలిపాడు. అప్లికేషన్లు, గేమ్స్, కోడింగ్ సిస్టమ్స్ తయారు చేయటం తన కల అని వివరించాడు.
అడటం నుంచి సృష్టించేవరకు..
చిన్నప్పటి నుంచి గ్యాడ్జెట్లపై తల్సానియాకు ఆసక్తి ఏర్పడిందని అతని తండ్రి వెల్లడించాడు. గేమ్స్, పజిల్స్ పూర్తి చేయటం ఇష్టపడేవాడని, అలా వాటిని తయారు చేయాలని భావించే వాడని చెప్పాడు. తర్వాత తల్సానియాకు కోడింగ్‌లో ప్రాథమిక అంశాలు నేర్పినట్లు తెలిపాడు.
ఇదీ చూడండి: ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్‌కు వెళ్లి...నదిలో పడి!