Militants Arrested: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్, బందీపొరా ప్రాంతాల్లో లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాద అనుచరులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
నిందితుల్లో ముగ్గురిని బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో మంగళవారం అరెస్టు చేశారు అధికారులు. వారిని అరాఫత్ మజీద్ దర్, తౌసీఫ్ అహ్మద్ దర్, మోమిన్ నాజిర్ ఖాన్‌గా గుర్తించారు. వారి వద్ద ఉన్న రెండు పిస్టళ్లు, 13 తూటాలు, ఒక హ్యాండ్ గ్రెనేడ్ స్వాధీనం చేసకున్నారు.
మరో ఘటనలో.. బందీపొరాలో ఉగ్రవాద అనుచరులు ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ గులాం మహ్మద్, ఇర్షద్ హుస్సేన్, ఆశిక్ హుస్సేన్‌లను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరొకరు మాజీ టెర్రరిస్ట్ అని, గతంలో అనేక సార్లు దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితులు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల అనుచరులను తేలినట్లు పోలీసులు తెలిపారు. ముష్కరులకు ఆవాసం కల్పించడం, నిత్యావసర వస్తువులను అందించటం, రవాణా తదితర పనులను చేస్తుంటారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు- ఇద్దరు ఉగ్రవాదులు హతం