దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత నివారించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దేశ వ్యాప్తంగా 551 పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పీఎం కేర్స్ నిధులను వినియోగించనుంది.
అన్ని జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వీలైనంత త్వరగా ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
ఈ ఆక్సిజన్ ప్లాంట్లతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని కేంద్రం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేసింది.
రవాణా ఛార్జీలు రద్దు
మరోవైపు.. ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత పరికరాల రవాణాపై అన్ని రకాల సుంకాలను రద్దు చేయాలని దేశంలోని ప్రధాన నౌకాశ్రయాలను కేంద్రం ఆదేశించింది. నౌక సంబంధిత ఛార్జీలు, నిల్వ ఛార్జీలను సైతం రద్దు చేయాలని నౌకాయానం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ట్యాంకులు, సంబంధిత పరికరాలకు బెర్తింగ్లో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వీటి అన్లోడింగ్ వేగంగా జరిగేలా.. పోర్టుల ఛైర్పర్సన్లు వ్యక్తిగతంగా పర్యవేక్షణ సాగించాలని సూచించింది.