దీపావళి.. ప్రతి ఇంటిలో వెలుగులు నింపే ఈ పండగ గురించి ప్రస్తావన వస్తే మొదటగా గుర్తొచ్చేది టపాసులే. ఆ పండగ రోజు సాయంత్రం ఇంటి వాకిలిలో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటాం. కొన్ని టపాసులు మిరుమిట్లు గొలుపుతుంటే.. మరికొన్ని వింత వింత శబ్దాలతో పరిసరాలను హోరెత్తిస్తాయి. తయారీదారులు కూడా ఏటా కొత్తకొత్త టపాసులను ప్రవేశపెడుతున్నారు. ఇదే సమయంలో చౌకగా లభించే చైనా బాణసంచాకు డిమాండ్ పెరుగుతుండగా.. దేశవాళీ టపాసులకు ఆదరణ తగ్గిపోతోంది.
ఈ పరిస్థితిని గమనించిన ప్రముఖ్ పరివార్ అనే స్వచ్ఛంద సంస్థ 'వోకల్ ఫర్ లోకల్' అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆదర్శంగా తీసుకుంది. గుజరాత్లోని వడోదరా జిల్లాకు చెందిన ఈ సంస్థ.. 400 ఏళ్ల క్రితం నాటి పద్ధతిలో మట్టితో బాణసంచా తయారు చేయిస్తోంది. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది.
పర్యావరణ హితమైన ఈ బాణసంచాతో ఎలాంటి హాని ఉండదు అంటున్నారు ప్రముఖ్ పరివార్ అధ్యక్షుడు నితల్ గాంధీ.
"ఇవి 100 శాతం దేశవాళీ బాణసంచా. కోథిలుగా పిలిచే వీటిని బంకమట్టితో తయారు చేస్తారు. కొన్ని టపాసులను కాగితం, వెదురుతో తయారు చేస్తారు. పర్యావరణ హితమైన ఈ బాణసంచాతో పిల్లలకు ఎలాంటి హాని ఉండదు. వోకల్ ఫర్ లోకలే లక్ష్యంగా మేము వీటిని తయారు చేయిస్తున్నాము. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం."
-నితల్ గాంధీ, ప్రముఖ్ పరివార్ అధ్యక్షుడు
ఈ స్వదేశీ బాణసంచా తయారీతో తమకు ఉపాధి దక్కడంపై తయారీదారులు హర్షం వ్యక్తం చేశారు.
"400 ఏళ్ల క్రితం నుంచి ఈ తయారీ పద్ధతి ఉంది. గిరాకీ లేక 20 ఏళ్ల క్రితమే వీటి తయారీని ఆపేశాను. కానీ ఓ రోజు నితల్ గాంధీ వచ్చి వీటి గురించి అడిగారు."
-రమణ్ ప్రజాపతి, బాణసంచా తయారీదారుడు
ప్రస్తుతం ఈ బాణసంచాకు స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోంది.
ఇదీ చూడండి : విద్యార్థుల బడి బాట- ఉపాధ్యాయుల అదిరే స్వాగతం