4 Members Of Same Family Murdered : కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. ముసుగు వేసుకుని వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి.. కత్తితో పొడిచి నలుగురిని చంపేశాడు. మరొకరిని తీవ్రంగా గాయపరిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడుపి జిల్లాలోని కెమ్మన్ను ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను హసీనా (48), అఫ్నాన్ (23), అనాజ్ (21), అసీమ్ (14)గా పోలీసులు గుర్తించారు. హసీనా భర్త గల్ఫ్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హసీనా అత్త ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్లు వెల్లడించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.
హోమ్ స్టేలో బాలికపై గ్యాంగ్‌రేప్
ఉత్తర్‌ప్రదేశ్.. ఆగ్రాలోని ఓ హోమ్‌స్టే(వసతి గృహం)లో పనిచేస్తున్న బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాలిక ప్రతిఘటించడం వల్ల తీవ్రంగా దాడి కూడా చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం వల్ల బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజ్నగరి ఫేజ్ 2లో ఉన్న ఓ హోమ్‌స్టేలో ఏదో అవాంఛనీయ ఘటన జరుగుతున్నట్లు పోలీసులకు శనివారం రాత్రి సమచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హోమ్‌స్టేలోకి వెళ్లగా ఓ బాలిక ఏడుస్తూ కనిపించింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు చెప్పింది. బలవంతంగా మద్యం తాగించారని.. యువకులంతా అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది.
"నేను గత ఏడాదిన్నరగా హోమ్ స్టేలో పనిచేస్తున్నాను. నాకు సంబంధించిన ఓ అసభ్యకరమైన వీడియోను వైరల్ చేస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనేక విధాలుగా వేధిస్తున్నారు. శనివారం రాత్రి కూడా అదే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. ఆ సమయంలో నాపై చేయి కూడా చేసుకున్నారు. బలవంతంగా గదిలో బంధించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు" అంటూ బాధితురాలు.. తనపై జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జితేంద్ర, రవి, మనీశ్, దేవ్ కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మిగతా వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. హోమ్ స్టేలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.