26 Week Pregnancy Supreme Court : ఓ మహిళ తన 26 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతినివ్వాలంటూ చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా? అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని అన్నారు.
అసలు కేసు ఏంటంటే?
Termination Of Pregnancy At 26 Weeks : ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత అబార్షన్ చేయించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. అయితే ఈ పిటిషన్‌పై మొదట విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది.
Woman Decision To Terminate Pregnancy : అయితే 26 వారాల గర్భ విచ్ఛిత్తి కేసులో బుధవారం ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నమైన తీర్పునిచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరు అబార్షన్‌కు విముఖత తెలపగా మరొకరు సమర్థించారు. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న మహిళ మానసిక కుంగుబాటుతో బాధపడుతోందని, ఆర్థికంగానూ మూడో బిడ్డను పెంచే స్థితిలో లేదని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది. అయితే పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికతో ఈ తీర్పును రీకాల్ చేయాలంటూ కేంద్రం విజ్ఞప్తి చేసింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి..
Termination Pregnant Woman : దీంతో ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ క్రమంలోనే అబార్షన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఆ బిడ్డను మేం చంపలేం'
SC On Termination Pregnant Woman : "తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది" అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది.