అఫ్గాన్ నుంచి 25 మంది ఐసిస్ సానుభూతిపరులు(ISIS News) భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నాయి. వీరంతా కేరళకు చెందిన భారతీయులేనని, భారత్‌కు అతిపెద్ద ముప్పుగా పరిణమించిన ఐసిస్ పట్ల ఆకర్షితులై 2016-18 మధ్య దేశాన్ని వీడినట్లు చెప్పాయి.
ఐసిస్‌తో సంబంధాలున్న కారణంగా వీరందరూ ఇప్పటికే జాతీయ దార్యాప్తు సంస్థ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. అయితే వారు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారన్న విషయంపై మాత్రం అధికారులకు స్పష్టత లేదు. కానీ వీరంతా దేశం వీడి వెళ్లాక అఫ్గాన్ నంగర్హార్ ప్రావిన్సులో ఐసిస్‌లో చేరినట్లు(ISIS in Afghanistan) సమాచారం ఉంది. అందరూ మళ్లీ భారత్‌కు వచ్చే సూచనలు కనిపిస్తున్నందున అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులపై పటిష్ఠ నిఘా ఉంచారు.
సోదాల్లో...
దిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఐసిస్ సానుభూతిపరుల కార్యకలపాలపై దర్యాప్తు జరిపినప్పుడు అధికారులకు వీరి గురించి తెలిసింది. ఈ 25మందిపై ఇప్పటికే ఎన్ఐఏ(NIA ISIS Kerala) రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. వీరిలో అబ్దుల్లా అబ్దుల్ రాషిద్, డా.ఇజాస్ కల్లుకెట్టియ పురాయిల్ ఉన్నారు. ఐసిస్‌లో చేరేలా యువతను ఆకర్షించేది ఈ ఇద్దరే.
ఈ 25 మందిలో కొందరు చనిపోయినట్లు వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. కానీ విదేశీ సంస్థల నుంచి అలాంటి సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. 25 మందిలో కొందరు 2019లో జరిగిన డ్రోన్ దాడిలో మరణించారని, మరికొందరు ఘనీ ప్రభుత్వ హయాంలో లొంగిపోయారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే కాబుల్ జైలులో ఉన్న మహిళా ఫైటర్లు కొందరు తాలిబన్లు జైళ్లను ఖాళీ చేయించాక విడుదలయ్యారని తెలిపాయి.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం(NIA ISIS) ఐసిస్ సానుభూతిపరులు పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మున్సిప్.. ఆన్లైన్ ద్వారా నియామకాలు చేపడుతున్నాడు. పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దులోనే ఇతడు ఉంటున్నాడు.
ఇదీ చదవండి: Taliban news: మద్యం సీసాలు పగులకొట్టి.. పిల్లల పుస్తకాలు ధ్వంసం చేసి..