అసోం కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని దిపు వైద్య కళాశాలలో మంగళవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మంది అస్వస్థతకు గురయ్యారు. బుధవారం నాటికి 28 మంది డిశ్చార్జి కాగా మిగతా 117 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు కార్యక్రమానికి హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆహారం సేవించిన కారణంగా తాను కూడా అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు.
"ఈ కార్యక్రమానికి దాదాపు 8000 మంది హాజరు కాగా అందరికీ బిర్యానీ అందించారు. నేను కూడా అదే ఆహారం తీసుకున్నాను. కడుపునొప్పి వంటి సమస్యను ఎదుర్కొన్నా... ప్రస్తుతం బాగానే ఉన్నా"
-హిమంత్ బిశ్వ శర్మ, ఆరోగ్య మంత్రి.
ఆసుపత్రిలో చేరిన వారిలో ఒకరు మృతిచెందారు. అయితే విషపూరిత ఆహారం వల్లే ఆయన మృతిచెందారా అనేది ఇంకా తెలియాల్సి ఉందని కర్బీ అంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్జీ చంద్ర ధ్వజ సింగ తెలిపారు. ఫుడ్ శాంపిళ్లను పరీక్షకు పంపినట్లు పేర్కొన్నారు.
దిపు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సు విద్యా సంవత్సరం ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ సైతం హాజరయ్యారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.