సరిహద్దుల్లో(India China Border) కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా మధ్య 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు(India China Commander Level Talks) ప్రారంభమయ్యాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్‌లో ఉదయం పదిన్నర గంటలకు చర్చలు(India China Commander Level Talks) ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బలగాల ఉపసంహరణే లక్ష్యంగా..
తూర్పు లద్దాఖ్(Eastern Ladakh Standoff) ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత బృందానికి లెహ్‌లోని కోర్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహిస్తున్నారు. డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి, మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది.
60 వేలకుపైగా బలగాలు..
గత ఏడాది నుంచి భారత్, చైనా మధ్య ఇప్పటికే 12 సార్లు కోర్ కమాండర్ స్థాయి చర్చలు(India China Commander Level Talks) జరిగాయి. ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి, ఆగస్టులో గోగ్రా ప్రాంతం నుంచి ఇరుదేశాలు తమ తమ బలగాలను ఉపసంహరించాయి. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఇరుదేశాలు చెరో 60 వేలకుపైగా బలగాలను మోహరించాయి. దీంతో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోఉన్న ఉద్రిక్త పరిస్థితే.. భారత్, చైనా సరిహద్దుల్లో కూడా నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో పెట్రోలింగ్ పాయింట్ 15 లేదా హాట్ స్ప్రింగ్ వద్ద బలగాల ఉపసంహరణే ప్రధాన అజెండా అని తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు- మేమూ వెనక్కి తగ్గం'
ఇదీ చూడండి: 200 మంది చైనా సైనికులు.. భారత్‌లో చొరబాటుకు యత్నం!