1,200 ఏళ్ల క్రితం నాటి అరుదైన దుర్గాదేవి విగ్రహాన్ని(Goddess Durga) కశ్మీర్ బుద్గాం జిల్లాలో పోలీసులు(Jammu and Kashmir Police) స్వాధీనం చేసుకున్నారు. జీలం నదిలో ఇసుక తోడే ఓ కూలీ వద్ద దీన్ని వారు గుర్తించారు. పక్కా సమాచారంతో.. ఖాన్సాహిబ్ ప్రాంతంలోని ఆ వ్యక్తి వద్దకు చేరుకుని, సోదాలు చేసి ఈ విగ్రహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
12 సెంటిమీటర్ల పొడవు 8 సెంటిమీటర్ల వెడల్పుతో.. సింహంపై దుర్గాదేవి ఆసీనులై ఉన్నట్లుగా ఈ విగ్రహం చెక్కి ఉంది. ఆగస్టు 31న ఇసుక తరలిస్తుండగా తనకు ఈ విగ్రహం దొరకిందని సదరు కూలీ పేర్కొన్నాడు. ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్కు బుద్గాం ఎస్ఎస్పీ తాహీర్ సలీం ఖాన్ అప్పగించారు. ఇది దాదాపు క్రీస్తు శకం 7-8వ శతాబ్దం కాలం నాటికి చెందిందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: భాజపా నేత మేనకోడలిపై ఎద్దు దాడి
ఇదీ చూడండి: 'గుర్తు తెలియని వ్యక్తుల' నుంచే జాతీయ పార్టీలకు ఆదాయం!