ఎంపీ మాధవికి సొంతపార్టీ నేతల నుంచి నిరసన సెగ! - Goddeti Madhavi
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 8:06 PM IST
YSRCP leaders protest Against Araku MP Goddeti Madhavi: అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగలు తీవ్రమవుతున్నాయి. మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం పట్ల వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తీవ్ర వ్యతరేకత వ్యక్తమవుతోంది. అరకు నియోజకవర్గం హుకుంపేటలో ఎంపీ నిధులతో మంజూరు చేసిన వీధిలైట్లు, డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాధవికి సొంత పార్టీ నుంచే చేదు అనుభవం ఎదురైంది.
హుకుంపేట ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వస్తున్న మాధవిని అడ్డుకునేందుకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఎంపీ గో బ్యాక్ అంటూ వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు నిలువరించారు. మాధవి స్థానికురాలు కాదని, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహించేది లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మాధవికి తగిన బుద్ధి చెబుతామని నిరసనకారులు హెచ్చరించారు. సీఎం జగన్ తమ ఆవేదనను విస్మరిస్తే పార్టీ కేడర్ మూకుమ్మడిగా రాజీనామా చేస్తుందని తెగేసిచెప్పారు.