Ganja: చంద్రగిరిలో రెచ్చిపోయిన యువకులు.. గంజాయి మత్తులో - ఏపీ క్రైమ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Effect Of Ganja : యువత మద్యం, గంజాయి వంటి అలవాట్లతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే ఒక్కోసారి ఆ మత్తులో మునిగి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. చంద్రగిరిలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. చంద్రగిరి రెడ్డి వీధిలో ఒకరు చనిపోగా.. అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈలోగా వారిపైకి ఓ ద్విచక్ర వాహనం దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన పలువురు వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకోగా.. మరో యువకుడు పారిపోయాడని పేర్కొన్నారు. పట్టుకున్న తర్వాత యువకులను పరిశీలించగా వారి వద్ద గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం ఇద్దరు యువకులను, ద్విచక్ర వాహనాన్ని, గంజాయి ప్యాకెట్‌ను పోలీసులకి అప్పగించినట్లు తెలిపారు. అయితే గతంలో కూడా చంద్రగిరి ప్రభుత్వ కళాశాల వెనుక వైపున విచ్చలవిడిగా యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. అయితే పోలీసుల నిఘా వైఫల్యం వల్లనే ఇంత విచ్చలవిడిగా చంద్రగిరిలో గంజాయి లభ్యమవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు అప్రమత్తమై గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పారిపోయిన మరో యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చదవండి :