Couple Committed to Suicide : పెళ్లయిన రెండేళ్లకే..! కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్య... ఆ తర్వాత భర్త సైతం - ఏపీ నేర వార్తలు
🎬 Watch Now: Feature Video
Couple Committed to Suicide : కుటుంబ కలహాలతో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వీరి మరణంతో ఏడు నెలల చిన్నారి అనాథగా మారడం స్థానికులను కలచి వేస్తోంది. గ్రామస్థులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడిమిరాల గ్రామానికి చెందిన రంగనాయకులుకు.. పత్తికొండ మండలం చిన్న హుళ్తి గ్రామానికి చెందిన లతకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడు నెలల క్రితం కుమారుడు జన్మించగా.. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో ఒక్కసారిగా కలహాలు తలేత్తాయి. దీంతో శనివారం రోజున లత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను కర్నూలులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించటంతో ఆదివారం ఆమె చికిత్స పొందూతూ ప్రాణాలు విడిచింది. ఆమె మరణ వార్త విన్న భర్త తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కోట్ల రైల్వే స్టేషన్ వద్ద అతడు ఆత్మహత్యకు పాల్పడగా.. వీరిద్దరి మరణంతో గుడిమిరాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దంపతులిద్దరి మరణంతో ఏడు నెలల చిన్నారి అనాథగా మారాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దేవనకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.