YCP leaders attacked surveyor in Tehsildar office: అధికారులైనా.. ఆర్టీసీ ఉద్యోగులైనా సరే..! సర్వేయర్‌పై వైసీపీ నేతల దాదాగిరి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2023, 6:57 PM IST
YCP Leader Attack On Revenue Employees: వైసీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో దాడులకు తెగబడుతున్నారు. తప్పులను ప్రశ్నించిన వారిపై దాడి చేయడం పరిపాటిగా మారిపోయింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన మరువక ముందే... మరో చోట ప్రభుత్వ అధికారిపై దాడికి యత్నించిన వీడియో సంచలనంగా మారింది. తమకు అనుకులంగా పనిచేయడం లేదంటూ... ఓ సర్వేయర్ పై వైసీపీ నేతలు దాడి చేయడమే కాకుండా... నోటి వచ్చినట్లు దుర్భాషలాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అయితే, దాడులు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
కోర్టు వివాదంలో ఉన్న భూమికి అనుభవదారు ధ్రువపత్రం ఇచ్చేందుకు నిరాకరించారనే కారణంతో వైసీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలోనే సర్వేయర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో వెలుగుచూసింది. దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దాడి ఘటనపై సర్వేయర్ జిల్లా కలెక్టర్ గిరీశ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సూచన మేరకు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని సర్వే నంబరు 1351లో 1.55 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఇదే పంచాయతీలోని పెద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన రమేష్‌రెడ్డి, వెంకట నారాయణరెడ్డి.. మరోవర్గమైన సునీల్‌రెడ్డి, అనిల్‌రెడ్డిల మధ్య గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట నారాయణరెడ్డి ఈ భూమిపై ఆర్‌వోఆర్ కోర్టులో దావా వేశారు. భూమిలో తమకు వాటా ఉందని... ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలని అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ ధనంజయులు సర్వేయర్‌ను విచారించాల్సిందిగా ఆదేశించారు. విచారణ చేపట్టిన సర్వేయర్.. కోర్టు వివాదంలో ఉన్న భూమికి ధ్రువపత్రాలు ఇవ్వలేమని తెల్చి చెప్పారు. అయినప్పటికీ అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి గత మూడు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం కార్యాలయానికి వచ్చిన ఈ ఇద్దరూ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ సర్వేయర్‌పై దాడికిదిగారు. దాడి ఘటనను కార్యాలయ సిబ్బంది వీడియో తీశారు. ఆ వీడియో శనివారం వాట్సప్‌ల్లో చక్కర్లు కొట్టింది.దాడి చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో... ఆయన సూచనల మేరకు సర్వేయర్ రెడ్డప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని పీలేరు సీఐ వెల్లడించారు.