Birds Atlas Programme in IISER At chittoor District : పక్షుల అందాలు, అటవీ ప్రాంతంలో అవి చేసే విన్యాసాలు, కిలకిలరావాలు ఇలాంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం చేయడంలో జాతీయ విద్యాసంస్థలైన ఐఐటీ, ఐసర్ (IISER Tirupati) విద్యార్థులు లీనమైపోయారు. ఐసర్ వేదికగా ఈ నెల 9వ తేదీన విహంగ వైవిధ్యం ప్రధానాంశాంగా ‘బర్డ్ అట్లాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇందు కోసం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలు, పొలాల గట్లు, వాగులు, వంకల్లో విహరించే పక్షులను ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కలెక్టర్‌తో పాటు అటవీశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించే సమావేశానికి విద్యార్థులు సిద్ధమవుతున్నారు.
![Birds Atlas Programme in IISER At chittoor District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/23499657_birds-atlas-programme-in-iiser-at-chittoor-district.jpg)
తిరుపతికి చెందిన తిరుపతి నేచర్ సొసైటీ, తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ సంస్థతో పాటు అటవీశాఖ సిబ్బంది సహకారంతో ప్రకృతిని ఆస్వాదిస్తూ విద్యార్థులు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. పక్షుల వైవిధ్యానికి సంబంధించి ఇక్కడి ప్రాంతంలో కన్పించే పక్షులు వాటిల్లో ఉన్న అరుదైన జాతులు పట్టణ ప్రాంతాల్లో అంతరించిపోయిన వాటికి సంబంధించి వివరాలను సవివరంగా తెలియజేయడం కోసం ఈ వేడుకను జరుపుతున్నారు.
కోరంగి అభయారణ్యంలో విదేశీ పక్షుల సందడి
విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల వారితో కలసి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి పలు రకాల పక్షులను కెమెరాల్లో బంధించారు. అవన్నీ ‘బర్డ్ అట్లాస్’ ద్వారా అందరికీ తెలియజేసేందుకు సన్నాహాలు చేయడం విశిష్టత సంతరించుకుంది. ప్రకృతి ఆహ్లాద వాతావరణానికి ఎంతో ముగ్ధులయ్యామని సందర్శనకు వచ్చిన విద్యార్థులు తెలుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుంటే ఎంతో అనుభూతి పొందామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పక్షులు చేసే విన్యాసాలను అటవీ ప్రాంతాలు, పొలాల్లో చూసి తీరాల్సిందే అని అనిపించింది. ఇవన్నీ అమాంతం మనస్సుకు హత్తుకున్నాయని ఆహ్లాదం అందించాయని విద్యార్థుల బృందమంతా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా గడిపారని వివరిస్తున్నారు.