దురదగా ఉందని వెళ్తే రేబిస్ వ్యాక్సిన్ వేశారు - ఉదయగిరి సీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యంపై రోగి ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 9:36 PM IST
Wrong Injection to Patient in Nellore District: శరీరం దురదగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. వైద్యుడు చెప్పిన ఎవిల్ ఇంజక్షన్‌కు బదులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం గంగవరానికి చెందిన ఇజ్రాయెల్ అనే వ్యక్తి శరీరం దురదగా ఉందని గత నెల 30వ తేదీన ఉదయగిరి సీహెచ్‌సీకి వెళ్లారు. వైద్యుడు అతడిని పరీక్షించి.. ఎవిల్ ఇంజక్షన్‌ను ఓపీ కాగితంపై రాసి ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇంజక్షన్ గదికి వెళ్లగా.. అక్కడ ఉన్న నర్సు ఎవిల్‌కు బదులు ఏఆర్ టీకా ఇచ్చారు. ఈ నెల 2, 5వ తేదీల్లోనూ ఇంజక్షన్ వేయించుకోవాలని చెప్పారు. తొలుత రెండో తేదీన ఇంజక్షన్ వేయించుకుని వెళ్లారు. తరువాత 5వ తేదీకి బదులు.. 7వ తేదీన రాగా.. ‘మీరు ఆలస్యంగా వచ్చారు.. డాక్టర్ వద్దకు వెళ్లి కాగితంపై రాయించుకొని రావాలని సిబ్బంది సూచించారు.
Government Hospital Negligence in Udayagiri: ముందు వేసిన రెండు డోసులు ఏఆర్‌వీ కావడంతో డాక్టర్ కూడా దాన్నే ప్రతిపాదించారు. అనంతరం ఇంజక్షన్ చేయించుకున్న ఇజ్రాయెల్ ట్యాబ్లెట్స్ కోసం వెళ్లగా.. అక్కడ ఉన్న సిబ్బంది మిమ్మల్ని కుక్క కరిచిందా.. పిల్లి కరిచిందా అని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న ఇజ్రాయెల్.. అదేమీ లేదని దురదగా ఉందని వచ్చానని తెలిపారు.
మీకు ఇప్పటివరకు ఏఆర్‌వీ వేశారని వారు చెప్పడంతో సదరు రోగి ఆందోళనకు గురై.. డాక్టర్ వద్దకు వెళ్లి తెలిపారు. ఆయన గత నెల 30వ తేదీన రాసిన ఓపీని తెప్పించి పరిశీలించగా.. అందులో ఎవిల్ ఇంజక్షన్ ఉంది. దీంతో నర్సు.. ఎవిల్‌కు బదులు ఏఆర్‌వీ వేసినట్లు గుర్తించగా.. సిబ్బంది నిర్లక్ష్యంపై రోగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.