లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 1:07 PM IST
Worst Conditions in Jagananna Colonies: జగనన్న కాలనీ(jagananna Colonies)ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామంటూ పదే పదే ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులు నివాసం ఉండేందుకు అవసరమైన కనీస మౌలికవసతులు కల్పనను మాత్రం గాలికి వదిలేసిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పడరాని పాట్లు పడుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. మిగ్జాం తుపాను(Michaung Cyclone) ప్రభావంతో జగనన్న కాలనీలు నీట మునగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు లేఅవుట్లో ప్రజల దుస్థితి దీనంగా మారింది.
Allotment of Jagananna houses in low-lying areas: నెల్లూరు జిల్లా పడుగుపాడు లేఅవుట్ జగనన్న కాలనీలో ప్రభుత్వ గృహాలు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణానికి ముందే రోడ్లు, మురుగుకాలువలు, మంచినీటి వసతి ఏర్పాటు చేసి నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఈ హామీలు కనుమరుగవ్వగా స్థలం కేటాయింపే లోతట్టు ప్రాంతాల్లో జరిగింది. రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. కాలనీల్లో కనీసం మౌలిక సదుపాయాలు, రోడ్డు వేయకపోవడంతో వర్షానికి కాలనీలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలు వచ్చినప్పుడు పక్కనే ఉన్న కాలువ పొంగడంతో ఇళ్ల నీట మునుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మెుత్తం 170 కేటాయింపు జరిగితే దానిలో 20 ఇళ్లు మాత్రమే నిర్మాణానికి నోచుకున్నాయి. తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా తాగు నీరు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.