Woman Lecturer Brutally Murdered: మదనపల్లెలో మహిళ దారుణ హత్య.. నడిరోడ్డుపై గొంతుకోసిన దుండగులు - AP Latest News
🎬 Watch Now: Feature Video
Woman Lecturer Murdered in Madanapalle: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై మహిళను దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మదనపల్లె పట్టణం సప్తగిరి నగర్ వద్ద ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న రుక్సానా దారుణ హత్యకు గురైంది. గురువారం సాయంత్రం కళాశాల నుంచి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుండగులు కాపుగాచి ఆమెపై దాడి చేసి.. గొంతు కోసి హత్య చేశారు. రుక్సానా భర్త ఖాదర్ అహ్మద్ అనే వ్యక్తికి మొదటి భార్య.. ఈమెకు పిల్లలు పుట్టలేదన్న కారణంతో ఆయేషా అనే మహిళను అహ్మద్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయమై తరచూ వారి కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి. ఈ విషయమై హతురాలు రుక్సానా తండ్రి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ఈలోపే రుక్సానా హత్యకు గురి కావడం జరిగింది. పోలీసులు తన ఫిర్యాదును తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని తండ్రి సంఘటనా స్థలంలో కన్నీటి పర్యంతమయ్యారు. హత్య జరిగిన ప్రదేశానికి మదనపల్లి డీఎస్పీ కేశప్ప, సీఐలు వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.