who killed babai: "హూ కిల్డ్ బాబాయ్".. లోకేశ్ పాదయాత్రలో ప్లకార్డుల ప్రదర్శన - yuvagalam padayatra Day 113 In Proddutur
🎬 Watch Now: Feature Video
Nara Lokesh yuvagalam padayatra: వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ శ్రేణులు వివేకా హత్యకు సంబంధించిన పోస్టర్లు పట్టుకుని ర్యాలీలు చేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వివేకాను ఎవరు చంపారని దానిపై ప్రజలకు తెలియజేసే విధంగా వివేకా ఫొటో, జగన్ ఫొటో అవినాష్ రెడ్డి, సునీత ఫొటోలను ప్రదర్శిస్తూ.. 'బాబాయిని ఎవరు చంపారు'.. అనే పేర్లతో ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. 'బాబాయిని అబ్బాయి చంపాడు' అనే ప్లకార్డులను ప్రదర్శించారు. 'హూ కిల్డ్ బాబాయ్.. అబ్బాయి కిల్డ్ బాబాయ్'.. అనే పకార్డులను ప్రదర్శించారు. ఈ నినాదాలతో పాదయాత్ర పొడవునా ర్యాలీగా వెళ్లారు.
పోస్టర్లు ప్రదర్శిస్తే కేసులు: నారా లోకేశ్ కూడా ఈ పోస్టర్ కార్డులు పట్టుకొని పాదయాత్ర వెంట ప్రజలకు చూపించి ఆలోచింపజేశారు. ఓ సందర్భంలో ఇలాంటి పోస్టర్లు ప్రదర్శిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని డీఎస్పీ నాగరాజు... లోకేశ్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు. డీఎస్పీ వాదనతో నారా లోకేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దారి పొడుగునా మా పార్టీ అధ్యక్షులకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారని లోకేశ్ డీఎస్పీని ప్రశ్నించారు. ముందు వాటిని తొలగించి రావాలని స్పష్టం చేశారు.
ఇలా పోస్టర్లు ప్రదర్శిస్తే కేసులు పెడతామని డీఎస్పీ నాగరాజు అనడంతో.. కేసులు పెట్టుకోండని లోకేశ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అన్నీ అనుమతులు తీసుకొని మేము పాదయాత్ర చేస్తున్నామన్న లోకేశ్.. మమ్మల్ని రెచ్చగొట్టేలా వైసీపీ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ డీఎస్పీ నాగరాజును ప్రశ్నించారు. వైసీపీ ఫ్లెక్సీల గురించి లోకేశ్ ప్రశ్నించగానే అక్కడి పోలీసులు నీళ్లు నమిలారు. ముందు వెళ్లి వైసీపీ ఫ్లెక్సీలు తొలగించాలని లోకేశ్ చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.