Water Users Associations on Krishna Tribunal: 'కృష్ణా జలాలపై కేంద్ర నిర్ణయంతో ఏపీకి అన్యాయం.. వెంటనే వెనక్కి తీసుకోవాలి' - Water Users Associations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 2:46 PM IST
Water Users Associations on Krishna Tribunal: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటా పునఃసమీక్షకు బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు (Brijesh Kumar Tribunal) అదనపు అధికారాన్ని కేంద్రం అప్పగించడం ఏపీకి చేసిన అన్యాయమని ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. కృష్ణానదిపై రాష్ట్ర హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని.. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించమని సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. దీనిపై త్వరలోనే కృష్ణా పరివాహక ప్రాంత రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ జరుగుతుందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం.. అనుమతుల్లేకుండా 255 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని.. అవన్నీ సక్రమ ప్రాజెక్ట్‌లుగా మార్చుకుని అదనపు నీటి కేటాయింపులు చేసుకునే ప్రమాదం ఉందని గోపాలకృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులకు భంగం కలిగించే.. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ నిర్ణయాన్ని అమలుకాకుండా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదించే ప్రసక్తి లేదని.. దీనిపై కృష్ణా పరివాహ ప్రాంత రైతులతో కార్యాచరణ రూపొందించి.. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.