Villagers Fire on Minister: 'నన్ను కాదు.. మీ ఎమ్మెల్యేను అడగండి..' ప్రజలకు మంత్రి సమాధానం - Pashuvullanka villagers fire on minister viswaroop
🎬 Watch Now: Feature Video
Pashuvullanka villagers fire on YSRCP minister Pinipe Vishwarup: వ్యవసాయ సహకార సంఘం గోడౌన్, ఎస్సీ సామాజిక భవనాల ప్రారంభోత్సవానికి వచ్చిన.. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు నిరసన సెగ ఎదురైంది. 'తమ గ్రామాలకు రోడ్లు వేయండి మహోప్రభో' అంటూ మంత్రి విశ్వరూప్‌ను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ల, పశువుల్లంక అంబటివారి పేటకు చెందిన గ్రామస్థులు నిలదీశారు. దీంతో 'మీ సమస్య గురించి మీ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి' అంటూ మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గతకొన్ని ఏళ్లుగా తమ గ్రామాలకు సరైన రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని.. మురమళ్ల, పశువుల్లంక గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య గురించి పలుమార్లు స్థానిక శాసన సభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఈరోజు మురమళ్ల, పశువుల్లంక గ్రామాల్లో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన.. రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను మహిళలు రోడ్డుపై నిల్చొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి విశ్వరూప్.. తన కాన్వాయ్‌ను నిలుపకుండా.. మీ సమస్యను ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌తో మాట్లాడుకోమని చెప్తూ వెళ్లిపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించి.. తమ గ్రామాలకు రోడ్లు వేయాలని కోరారు.