ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు - డ్రైవర్‌కు సరైన శిక్షణ ఇవ్వలేదని తేల్చిన అధికారులు - ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 3:17 PM IST
Vijayawada RTC Bus Incident Enquiry Report: విజయవాడ బస్టాండ్‌లో బస్సు ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ జరిపిన రవాణా శాఖ అధికారుల కమిటీ.. డ్రైవర్‌కు సరైన శిక్షణ ఇవ్వకుండా డిపోలోని ఆర్టీసీ అధికారులు బస్సు అప్పగించినట్లు తేల్చింది. డ్రైవర్‌కు బస్సులోని ఆటోమేటిక్ గేర్ సిస్టంపై సరిగా అవగాహన లేదని.. అందువల్లే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లతోనే బస్సు నడపాల్సి ఉండగా.. అలా చేయలేదని తెలిపింది.
Vijayawada RTC Bus Accident Three Died: నివేదికను అధికారుల బృందం రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించింది. రవాణా శాఖ నివేదికలోని అంశాలపైన ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమీక్షిస్తున్నారు. పోలీసు, ఆర్టీసీ అధికారుల దర్యాప్తు అంశాల ఆధారంగా చర్యలపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా సోమవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు.. 12వ నంబర్ ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చి.. రెప్పపాటు వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది.