వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంత చేసిందో తెలుసా సజ్జల! : తులసిరెడ్డి
🎬 Watch Now: Feature Video
Tulasi Reddy Mass Counter To Sajjala: వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డురమని తులసిరెడ్డి దుయ్యబట్టారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి 5 సార్లు పులివెందుల అసెంబ్లీ టికెట్, 4 సార్లు కడప లోక్‌సభ టికెట్ ఇవ్వడాన్ని ఇబ్బంది అంటారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంజయ్య, భవనం, కోట్ల మంత్రి వర్గాలలో వైఎస్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఇబ్బంది అంటారా? అంటూ తులసి ఎద్దేవా చేశారు. వైఎస్‌కు రెండు సార్లు పీసీసీ అధ్యక్ష పదవి, 1 సారి సీఎల్పీ పదవి, 2 సార్లు సీఎం పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లా అని పేరుపెట్టడాన్ని ఇబ్బంది అంటారా? అంటూ తులసిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డికి మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్, రెండు సార్లు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఇబ్బంది అంటారా.. సజ్జల రామకృష్ణా రెడ్డి అంటు పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2009లో కడప ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఇబ్బంది అంటారా?... లేక, వైఎస్ విజయమ్మకు 2010 ఉపఎన్నికలో పులివెందుల అసెంబ్లీ టికెట్ ఇవ్వడాన్ని ఇబ్బంది అంటారా.. అంటూ తులసిరెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఏ పార్టీ, ఏ కుటుంబానికి చేయనంత మేలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి చేసిందని.. ఆ విషయం తెలియదా... సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని వైఎస్ కుటుంబానికి ఇడుపులపాయ, పులివెందుల, కడప, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు... ఇలా దేశంలోని అనేక ప్రాంతాలలో రాజ ప్రసాదాలను మించిన భవంతులు, ఆస్తులు ఎలా వచ్చయాని తులసి రెడ్డి ప్రశ్నించారు.