Road Accident in Kadapa: విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ఇద్దరు ఉద్యోగులు.. మృతుల్లో ఆర్టీవో.. - news updates in ap
🎬 Watch Now: Feature Video
Today Road Accident in Kadapa: కడప శివారులోని అలంఖాన్ పల్లె కూడలి వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విధులు నిర్వహిస్తున్న బ్రేక్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్‌తో పాటు సహాయకుడు కేశవ్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా రవాణా శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విధి నిర్వహణలో భాగంగా ఇవాళ తెల్లవారుజామున బ్రేక్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, సహాయకుడు కేశవ్ ఇద్దరు అలంఖాన్ పల్లె కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరు వైపు నుంచి వస్తున్న ఓ లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ లారీని తప్పించబోయే ప్రయత్నంలో కమలాపురం వైపు నుంచి వస్తున్న టిప్పర్.. రోడ్డు పక్కన విధులు నిర్వహిస్తున్న బ్రేక్ ఇన్స్పెక్టర్, అతని సహాయకుడు కేశవ్‌లను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ డీటీసీ నిరంజన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.