Tirumala Srivari Parveta Utsavam: తిరుమలలో ఘనంగా జరిగిన శ్రీవారి పార్వేట ఉత్సవం - శ్రీవారి పార్వేట ఉత్సవం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 10:38 PM IST
Tirumala Srivari Parveta Utsavam: తిరుమలలో మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. శ్రీవారి ఆలయంలో ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత మలయప్పస్వామివారు తిరుచ్చిపై పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. శ్రీవారికి ఆస్థానం, నివేదన, హారతులు ఇచ్చారు. వేదపారాయణదారులు సందర్భానుసారంగా వేదమంత్రాలను పఠించారు. పంచాయుధమూర్తిగా దర్శనమిచ్చిన మలయప్పస్వామి శంఖం, చక్రంతోపాటు ఖడ్గం, గద, ఈటె, విల్లు, బాణం తదితర ఆయుధాలు ధరించి పార్వేటకు వెళ్లారు.
ఈ సంవత్సరం నూతన మండపంలో పార్వేట ఉత్సవం చేయడం చాలా ఆనందదాయకమని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. పాత మండపం శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేసినట్టు తెలిపారు. పాత మండపంలోని కళాఖండాలను రికార్డు చేసి యధావిధిగా తిరిగి నిర్మించామని, నూతన మండపం అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అత్యంత ప్రాచీనమైన, కూలడానికి సిద్ధంగా ఉన్న పార్వేట మండపాన్ని అధికారులు అదే రీతిలో పునర్నిర్మించారని, భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమలకు సంబంధించి భక్తులు సలహాలు ఇవ్వొచ్చు కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు.