Police attack on Rythu Diksha camp : అమరావతి రైతు శిబిరంపై పోలీసుల దాడి.. మహిళలు, వృద్ధులను సైతం...
🎬 Watch Now: Feature Video
Police attack on Rythu Diksha camp : రాజధాని అంటే మా పొలాలు ఇచ్చాం.. ఇప్పుడు ఏ దిక్కూ లేక మా పిల్లలకు ఏమీ పెట్టలేకపోతున్నాం.. వాళ్లు అన్యాయమై పోతున్నారు.. ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేయండి.. అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను కొంగుతో తుడుస్తూ రాజధాని మహిళా రైతులు బోరుమన్నారు. శాంతి భద్రతల నెపంతో వందలాది మంది పోలీసులు ఒక్క సారిగా దీక్ష శిబిరంపై దాడి చేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అహింసా పద్ధతిలో శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. రైతులను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు... వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా లాగి పడేశారు. ఊహించని పరిణామంతో రైతులు, వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆర్ 5 జోన్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ర్యాలీకి పిలుపునివ్వగా.. అందుకు పోటీగా వైఎస్సార్సీపీ నేతలు సైతం ర్యాలీలకు సిద్ధమయ్యారు. ఆర్ 5 జోన్ ను వ్యతిరేకిస్తూ తుళ్లూరు దీక్ష శిబిరంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునివ్వగా.. అదే సమయంలో ఆర్ 5 జోన్ కి మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతాయనే అనుమానంతో పోలీస్ యాక్ట్ 30 విధించారు. తుళ్లూరు దీక్ష శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉద్దండ రాయినపాలెంలో పులి చిన్నా ను బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. కాగా, శాంతి యుతంగా దీక్షలో పాల్గొన్న వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. రైతులను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు... వృద్ధులు, మహిళలని చూడకుండా లాగి పడేశారు. పోలీసుల వైఖరిపై రాజధాని రైతులు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, రాజధాని కోసం భూములివ్వడమే మా తప్పా? అని నిలదీశారు. అధికారం ఉందని ఇష్టానుసారం ప్రవర్తిస్తారా?.. మహిళలనీ చూడకుండా లాగి పడేస్తారా?.. భూములిస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఆర్5 జోన్ సృష్టించి భూములిస్తారా? అని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి న్యాయవాదులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు న్యాయవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని పీఎస్‌కు తరలించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ అరెస్టు చేశారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని జడ శ్రావణ్‌కుమార్ మండిపడ్డారు.