police harassment: ప్రాణాల మీదకి తెచ్చిన స్నేహితుడి ప్రేమ పెళ్లి.. యువకుడికి పోలీసుల టార్చర్! - ఏపీ ముఖ్యవార్తలు
🎬 Watch Now: Feature Video
Young man attempted suicide due to police harassment: కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరుపాపురం గ్రామానికి చెందిన రఫిక్ అనే యువకుడు పోలీసుల వేధింపుల తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు రఫిక్‌ను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. విరుపాపురం గ్రామానికి చెందిన రఫిక్ స్నేహితుడు.. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో నెల రోజుల కిందట యువతిని వెంటబెట్టుకుని పారిపోయి వివాహం చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు హలహర్వి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా, వారికి రఫిక్ సహకరించాడని.. పోలీసులు నెలరోజులుగా రోజూ స్టేషన్‌కు పిలిపించి తమ కుమారుడని కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. రఫిక్ సహకరించాడనే అనుమానంతో హలహర్వి ఏఎస్ఏ.. రఫీక్‌ను చితకబాదాడని తెలిపారు. నిత్యం వేధింపులు తాళలేక రూ.30వేలు ఇచ్చినా తమ కుమారుడిని వదల్లేదని ఆరోపించారు. ఓ వైపు అవమాన భారం, మరో వైపు పోలీసుల వేధింపులు తట్టుకోలేక తమ కుమారుడు ఆత్మహత్యకు యత్నించాడని రఫిక్ తల్లిదండ్రులు వాపోయారు.