Kollu Ravindra house arrest: మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గృహ నిర్భందం.. ఉద్రిక్తత
🎬 Watch Now: Feature Video
kollu ravindra house arrest: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల వైసీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు బయలుదేరిన కొల్లు రవీంద్రను పోలీసులు గృహనిర్భందం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కొల్లు రవీంద్ర నివాసానికి చేరుకుంటున్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలతో పాటు ప్రధాన రహదారిపైకి వచ్చి కొల్లు రవీంద్ర ధర్నా చేశారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
మచిలీపట్నంలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసిన అధికార పార్టీ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేయాలని... లేనిపక్షంలో రేపటి నుండి ఆమరణ దీక్ష చేయనున్నట్లు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. గత మూడు రోజుల క్రితం మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంలో టీడీపీ మైనార్టీ కార్యకర్తలపై వైసీపీ రౌడీమూకలు దాడి చేసిన ఘటనలో సయ్యద్ బాజీ, చోటా బాబులు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనకు సిద్ధమైన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. కొల్లు రవీంద్రతో ఇనగుదురుపేట సీఐ ఉమామహేశ్వరరావు చర్చలు నిర్వహించారు. టీడీపీ మైనార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ రౌడీమూకలను తక్షణం అరెస్ట్ చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు పోలీసులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని నిందితులను కాపాడుతున్నారని కొల్లు ఆరోపించారు.