ప్రశ్నిస్తే సస్పెన్షనా? ఇదెక్కడి విడ్డూరం - పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ : అచ్చెన్నాయుడు - AP Govt News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 10:03 AM IST
TDP State President Atchannaidu Letter to CS : అవినీతి అంశంపై మాట్లాడినందుకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్ ముర్షావలిని సస్పెండ్ చేయడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఏకారణంతో అయినా లంచం తీసుకోవడం సమర్థనీయం కాదని, అయితే ముర్షావలి లేవనెత్తిన సమస్యపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ముర్షావలి వివరించారన్నారు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో తద్వారా తెలుస్తోందని మండిపడ్డారు.
ముర్షావలి వెల్లడించిన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టకుండా అతన్ని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ చర్య చూస్తుంటే వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ముర్షావలి సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకుని సమస్యకు మూలంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు. ముర్షావలి ప్రకటన ద్వారా పరిస్థితుల గురించి తెలుసుకొని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సూచించారు.