కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఐఏఎస్ అధికారులపై టీడీపీ నేతల ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
TDP Leaders Complain to State Election Commissioner : కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఐఏఎస్ అధికారులు, రోల్ అబ్జర్వర్స్‌పై, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికారులు వారి విధులని సక్రమంగా పాటించడం లేదని మొహమ్మద్ షరీఫ్, పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పాత ఇంటి డోర్ నెంబర్లతోనే ఓటర్ జాబితా ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 5వ తేదీన ఇచ్చే కొత్త జాబితాలో కొత్త ఇంటి నంబర్ల ప్రకారమే ఓటర్ల వివరాలు ఉండేలా చూడాలని అన్నారు. ఓటర్ల జాబితాలోని పొరపాట్లు, రాష్ట్రంలోని అధికారులు చేస్తున్న తప్పులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ నేతల ఆదేశాలే పరమావధిగా పనిచేస్తున్న అధికారులు, కొందరు కలెక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 సంవత్సరానికి సంబంధించి, ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ ఐఏఎస్ అధికారులు ఓటరు జాబితాలోని లోపాల్ని సరిదిద్దే విధంగా జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలిస్తారు. అంతేకాకుండా వారికి మార్గనిర్దేశం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా వీటికి సంబంధించి ఐఏఎస్ అధికారులను నివేదిక అందించాలని తెలిపింది.