TDP Leader Pattabhi on Sand Reaches Tender in AP: "టెండర్లు ఎవరికి ఇవ్వాలో.. తాడేపల్లి ప్యాలెస్లో ముందే నిర్ణయం" - ఏపీలో ఇసుక రీచ్ల టెండర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 3:26 PM IST
TDP Leader Pattabhi on Sand Reaches Tender in AP: టెండర్ల పేరుతో మరోసారి ఇసుక కుంభకోణానికి సీఎం జగన్ తెరలేపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. టెండర్లు ఎవరికి ఇవ్వాలో.. ముందే తాడేపల్లి ప్యాలెస్లో నిర్ణయిస్తారన్నారు. ఒక టెండరు డాక్యుమెంటు విలువ రూ. 29.50 లక్షలు ఎందుకు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. తన సోదరుడు అనిల్ రెడ్డికి రాష్ట్రంలోని ఇసుక రీచ్లన్నింటిని కట్టాబెట్టాలనే దురాలోచనతోనే.. సీఎం జగన్ టెండర్ డాక్యుమెంట్ ఫీజు ధరను తగ్గించారని పట్టాభి ఆరోపించారు. గతంలో కూడా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక రీచ్లు అప్పగించటానికి జగన్ రెడ్డి ఇలానే అర్థం లేని టెండర్ నిబంధనలను తీసుకువచ్చారని అన్నారు. దీనిపై సమాచారం ఎమ్ఎస్డీసీ ద్వారా తెలిసిందన్నారు.
గతంలో కేవలం బిడ్ సెక్కూరిటీ మాత్రమే 120 కోట్ల రూపాయలు ఉంటే.. దాన్ని ఇప్పుడు కేవలం 77 కోట్ల రూపాయలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఇంత భారీగా బిడ్ సెక్యూరిటీ తగ్గించడానికి కారణం.. కేవలం అనిల్ రెడ్డికి ఇసుక రీచ్లు అప్పగించడానికేనని విమర్శించారు. బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ తగ్గించడంతో పాటు నిబంధనలను సైతం.. తమ్ముడు అనిల్ రెడ్డికి ముఖ్యమంత్రి అనుకూలంగా మార్చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్ ఎందుకు దాచిపెడుతోందో.. బిడ్ సెక్యూరిటీ మొత్తం ఎందుకు తగ్గించారో, ఇతర నిబంధనలు ఎందుకు మార్చారో ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.