బీసీ కులగణన పేరుతో భారీ మోసానికి వైసీపీ కుట్ర : కొల్లు రవీంద్ర - కులసంఘాల ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 3:58 PM IST
TDP leader Kollu Ravindra Comments on Caste Census: బీసీ కులగణన పేరిట వైసీపీ భారీ మోసానికి తెర లేపిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేసి బీసీలకు అందే లబ్ది తొలగించేందుకు కుట్ర పన్నారని ఆయన వెల్లడించారు. ప్రైవేటు సంస్థలకు బీసీల సమాచారమిచ్చి తమ బతుకులు తాకట్టు పెడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోసపూరిత రాజకీయాలతో ఎన్నికల్లో లబ్ది పొందాలని చేసే ప్రయత్నమే సామాజిక బస్సు యాత్రలని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి బీసీలను బానిసలుగా దిగజార్చారని కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీపై బీసీల పోరాట కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
నాలుగున్నర సంవత్సరాలుగా బీసీలను అణగతొక్కుతున్నా.. పట్టించుకోని వారు ఈ రోజు రోడ్లపైకి వస్తున్నారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మెుదటి నుంచి బీసీల కోసం పోరాడే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీయేనని కొల్లు తెలిపారు. ముఖ్యమంత్రి సలహాదారుల్లో ఒక్కరైనా బీసీ ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 76 మంది బీసీలను కిరాతకంగా హత్యలు చేసినా... ఏ ఒక్క బీసీ నాయకుడైనా సీఎంను ప్రశ్నించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు మెుదలు గ్రామ స్థాయి నాయకుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అన్యాయం చేస్తుంటే, ఇంకా జగన్ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు.