TDP Leader GV Reddy On AP Debts: రాష్ట్ర అప్పులపై వైసీపీ ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు.. కేంద్రం ఉదాసీనత ఎందుకో..? : జీవీ రెడ్డి
🎬 Watch Now: Feature Video
TDP Leader GV Reddy On AP Debts: పరిమితులకు మించి అప్పులు చేస్తున్న రాష్ట్రాలపై కన్నెర్రజేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు ఉదాసీనతగా ఉంది అని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు. అప్పులు తీసుకువచ్చి ఖర్చులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. అప్పులపై తప్పుడు సమాచారం వెల్లడిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు అప్పుల వివరాలను అడిగితే ఆర్బీఐ ద్వారా తీసుకువచ్చిన అప్పులను మాత్రమే వెల్లడిస్తూ.. కార్పొరేషన్లు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు ఉన్న బకాయిల వివరాలను బయటపెట్టడం లేదని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక అంశాల్లో ఎలాంటి లొసుగులు, తప్పులు లేనప్పుడు.. ప్రభుత్వం జీవోలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం వివిధ కార్పొరేషన్లకు నచ్చినవారికి చెల్లిస్తున్నది నిజం కాదా అని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును బహిరంగంగానే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని 22 నెలలుగా టీడీపీ అడుగుతున్నా.. అధికారుల్లో స్పందన లేదని వాపోయారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు చేశాయని ఇతర రాష్ట్రాలపై కన్నెర్ర చేసిన కేంద్రప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వంపై ఎందుకు ఉదాసీనతతో ఉంటోందని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై వైసీపీ ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.