TDLP Discussion on Countering YCP Atrocities: వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోవడంపై టీడీఎల్పీలో చర్చ..! - Chandrababu illegal arrest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 10:06 PM IST
TDLP Discussion on Countering YCP Atrocities: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌పై టీడీఎల్పీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి అసెంబ్లీ సభలో ‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమం’ అనే అంశంపై పట్టుబట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరిస్తున్న ఏకపక్ష తీరుపై ప్రస్తావించాలని నిర్ణయించారు.
TDLP Meeting at TDP Central Office: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ సభ్యులు సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపైనా చర్చించారు. అనంతరం గురువారం నాడు సభలో జరిగిన పరిణామాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశ్లేషించారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ శాసనసభాపక్షం మండిపడింది. శుక్రవారం జరగబోయే సభలో స్పీకర్ ఏకపక్ష తీరును ప్రస్తావించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సభలో వైసీపీ నేతల తీరు చూస్తుంటే.. భౌతిక దాడులకు దిగే సూచనలు కన్పిస్తున్నాయని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ అంశంపై శుక్రవారం సభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వొచ్చని.. అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే.. తమకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను పట్టుబట్టాలని నేతలకు సూచించారు. అయినా, స్పీకర్ అనుమతి ఇవ్వకుంటే.. అసెంబ్లీ బయటనైనా ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు. రేపటి శాసన మండలిలోనూ ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టనున్నారు.