ప్రభుత్వ ఉద్యోగాల్లేక, ప్రైవేట్ కంపెనీలు రాక! - 'నిరుద్యోగం'పై విద్యార్థి సంఘాల ఆందోళన - తెలుగుయువత ఆధ్వర్యంలో నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 3:55 PM IST
Student Unions concerned in Guntur district: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలంటూ గుంటూరు జిల్లాలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. గుంటూరు కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వం నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మోసగించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఎన్నికలు సమీపిస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ పేరుతో మరోమారు నిరుద్యోగులను మోసం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డాయి. కలెక్టరేట్లో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కొంత మంది విద్యార్థులను స్పందనలో వినతిపత్రం అందించేందుకు అనుమతించారు. విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ సమస్యలపై కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందించారు.
అధికారం కోసం ఉద్యోగాలపేరుతో జగన్ మోసం చేశాడు: ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలయ్యాయని విద్యార్థి నేతలు ఎద్దేవా చేశారు. ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ ప్రక్రియ చేపట్టలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. అందుచేతే అనేక మంది వయోపరిమితి దాటిందని వెల్లడించారు. అందుకే గ్రూప్స్ తదితర ఉద్యోగలకు వయోపరిమితి పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సీఎం అసమర్థత కారణంగా ఏపీలో నిరుద్యోగిత రేటు పెరిగిందని ఆరోపించారు. సీఎం చర్యల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు బయపడే పరిస్థితి నెలకొన్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కంపెనీలు రాక, ప్రభుత్వం ఉద్యోగాలు వేయక, రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.