State wide FAPTO Agitations రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన ఉపాధ్యాయులు.. సమస్యల పరిష్కారం కోసం 12 గంటల ధర్నా..
🎬 Watch Now: Feature Video
State wide FAPTO Agitations: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోను 12 గంటల ధర్నా నిర్వహించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా తీసుకువచ్చిన జీవో నంబర్ 117ని రద్దు చేయాలని విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అధికారంలోకి రాకముందు ఓ మాట.. వచ్చాక మరో మాట మార్చడం ముఖ్యమంత్రి జగన్‌కి పరిపాటిగా మారిందని కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఛైర్మన్ విజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని పార్వతీపురం డీఈవో కార్యలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఒంగోలులో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు కదం తొక్కారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ తీరు మార్చుకోవాలని ఉపాధ్యాయులకు అశాస్త్రీయమైన వర్క్ లోడ్ తగ్గించాలని కోరారు.