Park Issue in Nellore: పార్క్ కోసం కలిసి పోరాటం చేద్దాం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - నెల్లూరులో పార్కు ఆక్రమణ
🎬 Watch Now: Feature Video
Nellore Park Issue: నెల్లూరు నగరంలో 12 కోట్ల విలువైన స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. మహాత్మా గాంధీనగర్ ఎఫ్సీఐ గోడౌన్ ఎదురుగా ఉన్న విలువైన పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. పార్క్ స్థలం పరిశీలనకు వచ్చిన కమిషనర్ కారును స్థానికులు అడ్డగించి రోడ్డుపై బైఠాయించారు. పార్టీలకు అతీతంగా తమ కాలనీ పార్క్ స్థలాన్ని కాపాడుకుంటామని కార్పొరేటర్లు చెబుతున్నారు. స్థానికుల కోరిక మేరకు గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఇక్కడ పార్క్ అభివృద్ధికి 35 లక్షల రూపాయల నిధులు కేటాయించారు.
అందుకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, అధికార పార్టీ నేతలు మాత్రం కబ్జా చేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా దుమారం రేపుతోంది. సుమారు 12 కోట్ల రూపాయల నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలం కాపాడుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. చైతన్యపురి స్థానికులు, అన్ని పార్టీల నాయకులు.. రాజకీయాలతో సంబంధం లేకుండా పోరాటం చేద్దామని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఇక్కడ పార్క్ నిధులు కేటాయించారని తెలిపారు. ఇతరులు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు.