Shock to Minister Dharmana: ధర్మానకు 'సైకిల్' ఝలక్.. మహిళ రాక్.. మంత్రి షాక్..! - శ్రీకాకుళం జిల్లా
🎬 Watch Now: Feature Video
Shock to Minister Dharmana: సైకిల్‌కు ఓటేస్తానని ఓ మహిళ చెప్పిన సమాధానం విని మంత్రి ధర్మాన ప్రసాదరావు షాక్‌కు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎల్‌బీఎస్ కాలనీలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రం అందిస్తూ ఏ పార్టీకి ఓటేస్తావని అడిగారు. ‘సైకిల్‌కు వేస్తా’ అని ఆమె చెప్పడంతో మంత్రి కంగుతిన్నారు. ‘ఏయ్ చూడండి.. ఈవిడ సైకిల్‌కు ఓటేస్తుందట’ అని మంత్రి అసహనంతో గట్టిగా అనడంతో అక్కడున్న నాయకులు ఏమవుతుందోనని ఉత్కంఠగా చూశారు. వెంటనే ధర్మాన మాట్లాడుతూ.. ఎవరికైనా ఓటేసుకోవచ్చు. కానీ, గోతిలో పడిపోతారు జాగ్రత్త అని చెప్పారు. కార్యక్రమం నుంచి ఆదిలక్ష్మి బయటకు రాగానే ఆ ప్రాంత వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు చుట్టుముట్టి అలా ఎందుకు చెప్పావని మందలించారు. దీంతో ఆదిలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ.. ‘జగన్ చిన్నవాడు.. అధికారంలోకి వచ్చాక ఎలా పరిపాలిస్తాడో అనుకున్నా. కానీ అద్భుతమైన పాలన అందిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసేందుకు మళ్లీ హామీలు ఇస్తున్నారు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది’ అన్నారు. అంతకుముందు శ్రీకాకుళం గ్రామీణ మండలం కిష్టప్పేటలో మాట్లాడుతూ.. ‘కిష్టప్పేట ప్రజలు నాకు ఓట్లు వేయలేదనే కోపం లేదు. ఇంకో పది సార్లు వేయకపోయినా కోపం ఉండదు. మీ దగ్గరకు వస్తాం. చాకిరీ చేస్తుంటాం. ఫ్లోరైడ్ సమస్య ఉందని ఇప్పుడు చెబుతున్నారు.. గతంలో మీరు గెలిపించుకున్న వాళ్లు ఏం చేశారు? అయినప్పటికీ దీనిపై దృష్టి పెడతాం’ అని అన్నారు.