Sand mafia in Palnadu district: రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. అధికారుల సమక్షంలోనే గ్రామస్థులకు బెదిరింపులు
🎬 Watch Now: Feature Video
Sand Mafia in Palnadu District: పల్నాడు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్ లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని గ్రామ సర్పంచి విఠల్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రెవెన్యూ, గనుల శాఖ అధికారులు వైకుంఠపురం వచ్చారు. ఇసుక రీచ్ వద్దకు పిటిషనర్‌ను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాదులను కూడా అనుమతించేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బహిరంగ విచారణకు న్యాయవాదులు వస్తే తప్పేంటని ప్రశ్నించడంతో అనుమతించారు. రీచ్ వద్దకు వెళ్లిన తర్వాత అక్కడ తవ్వకాలు చేస్తున్నటువంటి అధికార పార్టీ నేతలు... పిటిషనర్ విఠలరావుపై దాడికి ప్రయత్నించారు. కోర్టులో పిటిషన్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీచ్ వద్దకు వచ్చిన వైకుంఠపురం గ్రామస్థులపైనా వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ఇసుక తవ్వకాల వల్ల జరుగుతున్న నష్టాన్ని అధికారులకు చెబితే తప్పేంటని గ్రామస్థులు ప్రశ్నించారు. వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. ఆ తర్వాత రెవెన్యూ, గనుల శాఖ అధికారులు రీచ్తో పాటు ఇసుక డంపింగ్ యార్డును పరిశీలించారు. అనుమతికి మించి తవ్వారని ఆరోపణలపై వాస్తవాలు తేల్చేందుకు డంపింగ్ యార్డు కొలతలు తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.