PRATHIDWANI: పరిహారంలో ప్రభుత్వం చెప్తున్న మాటలు నిజమేనా..! - ap local news
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: వైఎస్సార్ రైతుభరోసా నిధుల విడుదలపై సీఎం జగన్ అబద్దాలు చెప్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు కేంద్రం ఇచ్చే సాయానికి కూడా జగన్మోహన్ రెడ్డి తన పేరు చెప్పుకుని ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రచార పిచ్చి ముదిరిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చింది రూ.90కోట్లు మాత్రమేనని తెలిపారు.
ఇదే అంశంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పండించిన ధాన్యం కొనండని రైతులు ప్రశ్నిస్తే,.. వారిని అక్కడికక్కడే వీధి రౌడీల మాదిరి అరెస్టు చేయించిన పాలకుల దాష్టీకాన్ని రైతులు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే,.. మళ్లీ అవే డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కడం ఏమిటి.. అని నాదెండ్ల నిలదీశారు. నాలుగేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.54 వేల సాయం అందించామని చెబుతున్న ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలతో వారిని మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.
రైతు సంక్షేమం విషయంలో ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన నాలుగేళ్ళలో ఏం చేసింది. ముందురోజు ప్రధానమంత్రి కర్ణాటకలో విడుదల చేసిన పీఎం కిసాన్ పథకం నిధులకు.. మళ్లీ ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఇస్తున్నామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి... రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు ఎలా ఉంది? ఏ సీజన్‌లో జరిగిన పంటనష్టానికి ఆ సీజన్ ముగింపులోపే పరిహారం ఇస్తున్నామన్న ప్రకటనలో నిజం ఎంత? రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వాటికి చెల్లింపులు, మిగిలిన పంటలకు మద్దతుధరలు అమలు ఎలా ఉంది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎలా అందుతోంది? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,991.78 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామని అంటున్నారు. రైతులకు ఆ లబ్ది చేరిందా? చిన్న, సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులు అందరికీ వడ్డీ భారం తగ్గిస్తున్నామని కూడా ప్రభుత్వం చెబుతోంది? చిన్నరైతులకు ఆ మేరకు మేలు జరుగుతోందా? మొత్తంగా చూసినప్పుడు గతంతో పోల్చితే రైతు సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఇప్పుడు రైతన్నలకు కావాల్సిన తక్షణ సహాయ, సహకారాలు ఏమిటి? ఇలా వివిధ అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పి. జమలయ్య, బీకేఎస్ జాతీయ కార్యనిర్వాహకవర్గ సభ్యులు జె. కుమారస్వామి పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.