Police Raided Colleges in Vijayawada: విజయవాడలో పోలీస్ బంద్.. ఇంజినీరింగ్ కళాశాలలకు బలవంతపు సెలవు.. విద్యార్ధులకు హెచ్చరికలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 3:47 PM IST
Police raided colleges in Vijayawada: విజయవాడలో వివిధ కళాశాలల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసులు కళాశాలల్ని బలవంతంగా ఖాళీ చేయించారు. సిద్ధార్థ ఇంజినీరింగ్, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పోలీసులు పెద్దఎత్తున వెళ్లారు. లాఠీఛార్జీకి ప్రయోగించే ఇతర వస్తువులతో కవాతు చేసి చదువుల కొలువులో యుద్ద వాతావరణం సృష్టించారు. తామూ ఒకప్పటి విద్యార్థులమే అనే విచక్షణ మరచి.. తీవ్రవాదుల స్థావరాల మాదిరిగా కళాశాలను చుట్టుముట్టడం విస్మయానికి గురి.చేసింది. తరగతులు సస్పెండ్ (Classes are suspended) చేయించి బలవంతంగా కళాశాలలకు సెలవు ఇప్పించారు.
కళాశాలలో ఎవ్వరూ ఉండకూడదంటూ విద్యార్థుల్ని బలవంతంగా బయటకు పంపారు. తరగతి గదిలో అధ్యాపకులు బోధిస్తుండగానే కనీస మర్యాద పాటించని పోలీసులు... ఇవాళ బోధన లేదు ఏమీలేదు బయటకు పోండంటూ దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు వాపోయారు. తమ ఎదుటే తమ ప్రొఫెసర్ల.పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం ఎంతో బాధ కలిగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విద్యార్థులు నిరసనకు దిగుతారనే పోలీసులు వివిధ కళాశాలల్ని ఖాళీ చేయిస్తున్నారు. విద్యార్థులు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వాట్సాప్ ల్లో మెసేజ్ (WhatsApp message)లు పెట్టుకున్నారు.
రాష్ట్రంలో తాము ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నామంటూ అందుకు ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలను ప్రోత్సహించడమేనంటూ విద్యార్థులు తమ అభిప్రాయాలను వాట్సప్ లో పంచుకున్నారు. ఉన్నత విద్యకోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా స్థానికంగానే చదువుకునే ఏర్పాటుకు సూత్రధారి అయిన చంద్రబాబుకు అంతా మద్దతుగా నిలవాలని విద్యార్థులు సందేశాలు పంపుకొన్నారు. మద్దతు తెలుపుతామంటూ వివిధ కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా ముందస్తుగా కట్టడి చర్యలు చేపట్టారు. వివిధ కళాశాలల వద్ద భారీగా పోలీసు బలగాల మోహరించారు. క్రిమినల్ కేసు (criminal case) ల్లో ఇరుక్కుని బంగారు జీవితాన్ని పాడు చేసుకోవద్దంటూ విద్యార్థులకు పోలీసులు సూచించారు. నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెడతామంటూ పరోక్ష హెచ్చరికలు ఇచ్చారు.
144సెక్షన్, పోలీస్ 30యాక్ట్ అమల్లో ఉన్నందున ఎక్కడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దంటూ ఆదేశించారు. పెనమలూరు, గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలో కళాశాలల విద్యార్థులకు పోలీసులు నోటీసులు పంపారు. మొబైల్ లో పోలీసుల దృశ్యాలు చిత్రీకరిస్తున్న పలువురు విద్యార్థుల ఫోన్లు వారు లాక్కుని, ఎక్కువ చేశారంటే వ్యాన్ ఎక్కిస్తామంటూ బెదిరించారని విద్యార్థులు తెలిపారు.