Arrest in Eluru acid Case: ఇంటికి రావద్దన్నందుకే కక్ష.. మహిళపై యాసిడ్ దాడిలో నిందితులు అరెస్ట్
🎬 Watch Now: Feature Video
Eluru acid attack accused arrested: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ మేరి ప్రశాంతి వెల్లడించారు. బాధిత మహిళ సోదరికి, దాడిలో ప్రధాన నిందితుడు సతీష్‌కు కొన్నాళ్లుగా పరిచయం ఉందన్న ఎస్పీ.. తరచూ ఇంటికి వస్తున్న సతీష్‌ను బాధితురాలు రావొద్దని చెప్పిందని తెలిపారు. దీంతో మహిళను అడ్డు తొలగించుకోవాలని భావించిన సతీష్.. మరో ఇద్దరితో కలిసి దాడికి పాల్పడ్డాడని ఎస్పీ వివరించారు. బాధితురాలి ఎడమ కంటికి శస్త్రచికిత్స పూర్తైందన్న ఎస్పీ.. ఆ కంటికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. కుడి కంటికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్న ఎస్పీ.. ఆ తర్వాతే చూపుపై స్పష్టత వస్తుందని తెలిపారు.
ఏలూరు నగరానికి చెందిన వై. ఫ్రాన్సిక (35)అనే మహిళకు రాజమహేంద్రవరానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామాంజనేయులతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికే ఐదు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు సంవత్సరాల క్రితం విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్రాన్సిక ఏలూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే దంత ఆస్పత్రుల్లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. సతీష్, మరో వ్యక్తి ఇద్దరు కలిసి యాసిడ్ దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం హుటాహుటిన ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.