Outsourcing Employees Agitation: 'తొమ్మిది నెలలుగా జీతాలు లేవు.. ఇంకెన్నాళ్లు వేచి చూడాలి..?' - Panchayat Raj ENC Office employees agitation
🎬 Watch Now: Feature Video
Outsourcing Employees Agitation: వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని పంచాయతీరాజ్ ఈఎన్‌సీ కార్యాలయంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం వేతనాలు నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎన్‌సీ కార్యాలయంలో మొత్తం 64 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో చాలా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిని అప్కాస్‌లో.. వేతనాల చెల్లింపునకు ఆర్ధికశాఖ అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా తొమ్మిది నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. తమకు వేతనాలు ఇస్తామంటున్నారే తప్ప.. ఎప్పటిలోగా అనేది స్పష్టత లేకుండా పోతోందని కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత మంది ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందజేసిన ఫలితం లేదని వాపోయారు. ఇదిగో వేస్తాం.. అదిగో వేస్తాం.. అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస‌్యల్ని పరిష్కరించమని కోరితే.. కొత్త వారిని నియమిస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తమగోడు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకు చేరాలనే ఉద్దేశంతోనే పెన్‌డౌన్ చేసి కార్యాలయం బయట ఆందోళనకు దిగామని ఉద్యోగులు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. తమను తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.