AISF Agitation for Books: విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని కడపలో ఏఐఎస్ఎఫ్ ఆందోళన - Aisf Agitation
🎬 Watch Now: Feature Video
Aisf Agitation In Kadapa: కళాశాల విద్యార్థులకు తక్షణం పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ కడప ప్రాంతీయ విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాలలు తెరిచి రెండు వారాలైనప్పటికీ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి సర్కారు.. మండలానికి రెండు కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఆర్భాటపు ప్రచారాలు చేయడం దారుణమని ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వల రాజు మండిపడ్డారు. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకుంటే ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. జగన్ సర్కార్ కేవలం ప్రచారాలే తప్ప విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చడం లేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర సర్కార్ ఉందని రాజు విమర్శించారు. పుస్తకాలు లేకుంటే విద్యార్థులు కళాశాలలకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ విద్యా వ్యవస్థపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని రాజు ఆరోపించారు. తక్షణం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.