Mobile Tracking System ఫలితాలను ఇస్తున్న మొబైల్ ట్రాకింగ్ విధానం.. పోలీసుల అదుపులో ఆరుగురు - మొబైల్స్ రికవరీ బాధితులకు అందజేత వీడియో
🎬 Watch Now: Feature Video
Missing Mobile Tracking System వైయస్సార్ జిల్లాలో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానం సమర్థవంతంగా పనిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత ఐదు నెలల నుంచి ఇప్పటివరకు వివిధ రూపాల్లో సెల్‌ఫోన్స్ పోగుట్టుకున్న బాధితులకు 669 మొబైల్స్‌ను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ క్రమంలో తాజాగా 45 లక్షల రూపాయలు విలువచేసే 189 మొబైల్‌ఫోన్స్‌ను రికవరీ చేసి బాధితులకు గురువారు అందజేశారు. కడప పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బురాజన్ బాధితులకు ఈ సెల్‌ఫోన్స్‌ను అందజేశారు. గతంలో మొబైల్స్ పోగొట్టుకుంటే బాధితులు.. సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేవారు. కానీ ఆ మొబైల్ తిరిగి తమ చేతికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి.
అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు. గత ఐదు నెలల క్రితం అమలులోకి తీసుకుని వచ్చిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానం వల్ల సెల్‌ఫోన్స్ ఎక్కడ ఉన్నప్పటికీ వాటిని గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. గత ఐదు నెలల నుంచి ఇప్పటివరకు కోటి 45 లక్షల రూపాయలు విలువచేసే 669 మొబైల్స్‌ను ఐదు విడతలలో బాధితులకు అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అలానే రుణయాప్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర దుండగులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టైనవారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
మహిళలు కావడంతో వారిని మీడియా ఎదుట హాజరు పరచలేదు. ఒక వ్యక్తిని మాత్రం మీడియా ఎదుట ఇవాళ హాజరు పరిచారు. వీరందరూ కలకత్తా ప్రాంతానికి చెందినవారని ఎస్పీ సూచించారు. వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన కల్పన అనే మహిళ రుణయాప్ ద్వారా పదివేల రూపాయలు అప్పు తీసుకున్నారు. కానీ బాధితులు పదివేల రూపాయలుగానూ.. 24 వేల రూపాయలు చెల్లించారు. మరో లక్షా 76వేల రూపాయలు చెల్లించాలని బెదిరింపులకు గురి చేయడంతోపాటు డబ్బులు చెల్లించకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి అంతర్జాలంలో పెడతామని బెదిరించటంతో బాధితురాలు ఒంటిమిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేశామని చెప్పారు. నిందితుల ఖాతాలో ఉన్న 2.5 కోట్ల నగదు లావాదేవీలను స్తంభింప చేశామని తెలిపారు. ఎవరికైనా డబ్బులు అవసరమైతే గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి మాత్రమే తీసుకోవాలని, ఇలా రుణయాప్‌ల వలలో పడి మోసపోవద్దని ఎస్పీ సూచించారు.